వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు మాజీ కుడా చైర్మన్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు మర్రి యాదవ రెడ్డి గారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ గారు పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా నిలబడి పేదలు, బడుగు బలహీన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని యాదవ రెడ్డి తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం, ఆమె సేవలను స్మరించుకోవడం సమాజం బాధ్యత అని అన్నారు. తెలంగాణ సామాజిక ఉద్యమాల చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు ప్రత్యేకంగా నిలుస్తుందని, ఆమె ధైర్యం, పోరాట పటిమ, ఆత్మగౌరవం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు,బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ కి ఘన నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


