చేనేతల పేరుతో నకిలీ కార్డుల దందా?
- నకిలీ గుర్తింపు కార్డుల జారీపై ఆరోపణలు
- రూ.13 వేల వరకు వసూళ్లంటూ ప్రచారం
- మగ్గంతో సంబంధం లేని వారికి కార్డులా?
- చేనేత జౌలి శాఖల చౌద్యం
- అడిగినంత చిన్నవారికల్లా అడ్డదారిలో కార్డుల జారీ..
- పింఛన్ దరఖాస్తులపై పెరుగుతున్న అనుమానాలు
- క్షేత్రస్థాయి తనిఖీలపై అధికారిక స్పష్టత కోరుతున్న చేనేత కార్మికులు
సూర్యాపేట: చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అర్హత కలిగిన చేనేత కార్మికులకు పింఛన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే సూర్యాపేటలో చేనేత పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ నేపథ్యంలో నకిలీ చేనేత గుర్తింపు కార్డుల జారీపై ఆరోపణలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మధ్యవర్తులు చేనేత వృత్తితో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులకు సైతం చేనేత గుర్తింపు కార్డులు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కార్డుకు సుమారు రూ.13 వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
అర్హత లేని వారికి కార్డులు..?
చేనేత పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే వారి అర్హతను పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. దరఖాస్తుదారు నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారా? మగ్గం కలిగి ఉన్నారా? చేనేత సహకార సంఘంలో సభ్యత్వం ఉందా? గుర్తింపు కార్డు ఎలా జారీ అయింది? వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
రూ.13 వేల వసూళ్ల పై ఆరోపణలు..
చేనేత గుర్తింపు కార్డు ఇప్పిస్తామంటూ రూ.13 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్డుల జారీకి అధికారికంగా ఎంత రుసుము ఉంది? మధ్యవర్తులకు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందా? అనే అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
పింఛన్ దరఖాస్తులపై ప్రత్యేక పరిశీలన అవసరం
ప్రస్తుతం చేనేత పింఛన్ల కోసం సూర్యాపేట పట్టణంలో 176 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారినే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. మగ్గం, వృత్తి, ఆదాయం, గుర్తింపు కార్డు, సహకార సంఘ సభ్యత్వం తదితర వివరాలను రికార్డులతో సరిపోల్చితే అనర్హుల దరఖాస్తులను గుర్తించే అవకాశం ఉంటుంది.
నకిలీ ధృవీకరణ పత్రాలపై అధికారుల దృష్టి సారించాలి
చేనేత వృత్తితో సంబంధం లేని వ్యక్తులకు ధృవీకరణ పత్రాలు లేదా గుర్తింపు కార్డులు జారీ అయ్యాయా? అన్న అంశంపై సమగ్ర తనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కార్డులు జారీ అయినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.సొమ్ము ఎవరికి చేరుతోంది?కార్డుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే ఆ డబ్బు ఎవరికి చేరుతోంది? దరఖాస్తుదారుల నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఎలాంటి రసీదులు ఇచ్చారు? కార్డుల కోసం దరఖాస్తులను ఎవరు సమర్పించారు? అనే అంశాలపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి..
చేనేత సంక్షేమ పథకాల అసలు ఉద్దేశ్యం అర్హులైన కార్మికులకు ప్రయోజనం చేకూర్చడమే. కాబట్టి నకిలీ కార్డులు, తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదా అనర్హుల దరఖాస్తులపై వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


