ఇందిరమ్మ కుటుంబ బీమాతో రూ.5 లక్షల ఆర్థిక భరోసా
18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి అర్హత.. డిసెంబర్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
వేములవాడ, : కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ పట్టణంలోని 4వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోటి ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. కుటుంబంలో ఎవరి పేరుపై బీమా ఉండాలో వారే నిర్ణయించుకోవచ్చన్నారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో నమోదు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలను సైతం గుర్తించి పథకంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్రం, వేద పండితుల సలహాల మేరకు చేపడుతున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేకుండా భక్తుల నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా పనులు కొనసాగిస్తున్నామన్నారు. రూ.250 కోట్లతో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులు దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇందిరమ్మ పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని వివరించారు.
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులని, బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలను నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్కు సందేశం వస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆర్డీవో కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఈడీఎం శ్రీనివాస్, వార్డు సభ్యుడు తోట రాజు, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

