పన్నుల పెంపుపై కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం - ప్రతిపక్ష కౌన్సిలర్లు

అటెండెన్స్ రిజిస్టర్‌నే మినిట్స్ బుక్‌గా మార్చి అక్రమాలకు తెరలేపారు

పన్నుల పెంపుపై కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం - ప్రతిపక్ష కౌన్సిలర్లు

ములుగు టౌన్ : ములుగు మున్సిపాలిటీలో పెంచిన ఇంటి, వాణిజ్య పన్నుల విషయంలో ప్రతిపక్ష కౌన్సిలర్లపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రతిపక్ష (బీఆర్‌ఎస్) కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నాయకులు కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నవంబర్ 19న మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు చింతనిప్పుల భిక్షపతి చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష కౌన్సిలర్లు వాస్తవాలతో కౌంటర్ ఇచ్చారు. 1. అటెండెన్స్ రిజిస్టరే మినిట్స్ బుక్ అవుతోంది: కౌన్సిల్ సమావేశానికి హాజరైనప్పుడు కౌన్సిలర్లు కేవలం హాజరు రిజిస్టర్‌లో మాత్రమే సంతకాలు చేస్తారని, అయితే మున్సిపల్ అధికారులు సమావేశం ముగిసిన తర్వాత అదే రిజిస్టర్‌ను మినిట్స్ రిజిస్టర్‌గా మారుస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తాము వ్యతిరేకించిన అంశాలు కూడా ఆమోదం పొందినట్లు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయన్నారు. అటెండెన్స్, మినిట్స్ రిజిస్టర్లు వేర్వేరుగా నిర్వహించాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామన్నారు. 2. కమిషనర్ నిర్లక్ష్యం: ఈ లోపాన్ని గుర్తించినప్పటి నుంచి ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ అటెండెన్స్, మినిట్స్ రిజిస్టర్లను వేర్వేరుగా నిర్వహించాలని, నెలవారీ జమాఖర్చుల వివరాలు ఇవ్వాలని, పన్నుల అంశంపై స్పష్టత ఇవ్వాలని కమిషనర్‌ను నిలదీస్తున్నామని, అయినా కమిషనర్ ఎలాంటి స్పందన ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. 3. మెజారిటీ అధికార పక్షానిదే: కౌన్సిల్‌లో తీర్మానాన్ని ఆమోదించే పూర్తి మెజారిటీ ప్రతిపక్షానికి లేదని, అధికార పక్షమైన కాంగ్రెస్ కౌన్సిలర్లకే మెజారిటీ ఉందని స్పష్టం చేశారు. ఆ మెజారిటీతోనే అడ్డగోలుగా పన్నులు పెంచే నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టడం సిగ్గుచేటని అన్నారు. 4. ఆన్‌లైన్‌లో బయటపడ్డ కుంభకోణం: తీర్మానం తర్వాత పన్నుల డిమాండ్ నోటీసులు జనరేట్ అయిన తర్వాతే పన్నుల పెంపు ఎంత అసాధారణంగా ఉందో తమ దృష్టికి వచ్చిందన్నారు. స్వయంగా ఆన్‌లైన్‌లో పరిశీలించి, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో పోల్చి చూసిన తర్వాతే అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. పెంచిన పన్నులను తగ్గించే వరకు, ఒకే రకమైన అసెస్‌మెంట్లకు వేర్వేరుగా పన్నులు విధించే విధానాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ప్రతిపక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News