ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
* ల్ మోపాల్ మండల అభివృద్ధికి రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం * మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం * నియోజకవర్గానికి ఇప్పటికే 150 మహిళా సంఘ భవనాలు మంజూరు చేశాం * అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తాం
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండలంలోని బాడ్సి, సింగంపల్లి, చిన్నాపూర్, కాల్పోల్, బైరాపూర్ గ్రామాల్లో మొత్తం రూ.1.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.
ముందుగా బాడ్సి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఆలయం వద్ద ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం సింగంపల్లి, చిన్నాపూర్ గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిర్మించిన మహిళా సంఘ భవనాలను ప్రారంభించారు. బాడ్సి గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కాల్పోల్ గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇతర అభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా బాడ్సి గ్రామంలో నిర్వహించిన ప్రజా సమావేశంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ...బాడ్సి గ్రామం వ్యవసాయానికి, రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ గ్రామం నుంచి ఎంతోమంది ప్రముఖ నాయకులు, ఆదర్శ రైతులు ఎదిగి సమాజానికి సేవలందించారని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.22.82 కోట్ల నిధులు తీసుకువచ్చామని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, శివాలయ కాంపౌండ్ వాల్‌కు రూ.10 లక్షలు, ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు, రూ.2.60 కోట్లతో వంతెన నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
మోపాల్ మండలంలోని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు 75 గజాల ఇంటి స్థలం అందించేలా ప్రయత్నిస్తామని, పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల కారణంగా డాంబర్ వంటి ముడిసరుకుల దిగుమతి, ధరల్లో మార్పుల వల్ల రోడ్డు పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సుమారు 150 మహిళా సంఘ భవనాలు మంజూరు చేయించామని తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.13 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల రూపంలో సుమారు రూ.70 వేల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తూ వారిని కేవలం ప్రయాణికులుగానే కాకుండా ఆర్టీసీ బస్సుల యజమానులుగా కూడా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు వంటి వ్యాపార అవకాశాలను కల్పిస్తూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మహిళల చేతుల్లో ఆర్థిక అధికారం ఉంటే కుటుంబాలు, సమాజం బలోపేతం అవుతాయని, అందుకే మహిళల పేరుతోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మహిళా సంఘాలకు రూ.22 కోట్ల వడ్డీ మాఫీ జరిగిందని వెల్లడించారు.
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కిలో బియ్యానికి ప్రభుత్వం సుమారు రూ.52 ఖర్చు చేసి పేదలకు ఉచితంగా నాణ్యమైన బియ్యం అందిస్తోందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇప్పటికే 6 వేలకుపైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో కూడా అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట.. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, మొత్తం ప్రయోజనం దృష్ట్యా రైతులు క్వింటాలుకు రూ.3 వేలకుపైగా ధర లభించినప్పుడు విక్రయించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు రెండో పంటగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని కోరారు.
బీజేపీ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కరువు తెచ్చిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం అవివేకమని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో జరిగిన లోపాలపై కూడా ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పేరు మార్చుకున్నా ప్రజల పట్ల దాని వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపు, అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల సాధన విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తెలిపారు.
2047 రైజింగ్ తెలంగాణే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలు, పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత గురించి ఆలోచించి ఆచరణలో పెట్టే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు మహిళలు, గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, DCC అధ్యక్షులు నగేష్ రెడ్డి,మండల అధ్యక్షులు రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్ధన్, సంజీవ్ రెడ్డి, అంబర్ సింగ్, ఉమ్మాజి నరేష్, తారాచంద్ నాయక్, యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


