ముప్కాల్‌లో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ

లబ్ధిదారులకు పెన్షన్ మంజూరీ పత్రాలు అందజేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

ముప్కాల్‌లో ఘనంగా చేయూత పెన్షన్ల పంపిణీ

బాల్కొండ నియోజకవర్గ మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.21.91 కోట్ల రుణాలు పంపిణీ

-పాల్గొన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్ : ముప్కాల్ మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు పెన్షన్ మంజూరీ పత్రాలను అందజేశారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.21.91 కోట్ల విలువైన రుణాలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

 మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో 4.63 లక్షల మందికి చేయూత పెన్షన్లు అందుతుండగా, వారిలో 3.50 లక్షల మంది మహిళలే ఉన్నారని తెలిపారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పాఠశాల విద్యార్థుల యూనిఫారాల కుట్టింపు వంటి బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కమీషన్ రూపంలో రూ.167 కోట్ల ఆదాయం ఆర్జించాయని వివరించారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణలోనూ మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, మహిళా సంఘాల ఆదాయ వనరులు పెంపొందేలా ఆర్టీసీ అద్దె బస్సులను సమకూర్చుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేస్తూ, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇంటి నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి కోసం రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.76 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, 300కు పైగా మహిళా సంఘ భవనాలను నిర్మించామని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా ఆర్థిక చేయూత అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘం నుంచి రుణం తీసుకున్న సభ్యురాలు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆమె తీసుకున్న రుణాన్ని మాఫీ చేయడంతో పాటు రూ.10 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా.  తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 5,500 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. రైతులకు రూ.23 వేల కోట్ల మేర పంట రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా పేదల సంక్షేమమే పరమావధిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో నిజామాబాద్ జిల్లాను విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలిపారు. జిల్లాలో 20,555 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరమన్నారు. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర  ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20,555 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. చేయూత పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి తదుపరి విడతలో ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని, పెన్షన్ రాని వారు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో 3,092 మందికి కొత్త పెన్షన్లు.  బాల్కొండ నియోజకవర్గం పరిధిలో చేయూత పథకం కింద 3,092 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క లబ్ధిదారులకు పెన్షన్ మంజూరీ పత్రాలను అందజేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్ మొత్తాలు ఈ నెల 26వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపిక
చౌటకూర్ :  చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 19న మెదక్‌లో నిర్వహించిన...
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీల నిర్వహణ
ప్రతి కుటుంబానికి రూ5 లక్షల భీమా పథకం
తాడిడాన్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామసభ
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ కొండ రాజమ్మ
కారుపాకల కొమురయ్య మృతికి సర్పంచ్ బండి స్వామి సంతాపం