రుద్రంపూర్ సెయింట్ జోసఫ్ పాఠశాలలో భరోసా టీమ్ అవగాహన సదస్సు
కొత్తగూడెం బ్యూరో : విద్యార్థుల భద్రత, బాలల హక్కులు, మహిళల రక్షణపై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భరోసా టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ చల్లా అరుణ సూచించారు. రుద్రంపూర్‌లోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో భరోసా టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చల్లా అరుణ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఆపదలో ఉన్న బాధితులకు భరోసా కేంద్రం అందించే సహాయ సహకారాలు, రక్షణ చర్యల గురించి తెలియజేశారు. బాలలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు రూపొందించిన పోక్సో చట్టంలోని నిబంధనలు, పిల్లల హక్కులు, వారి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, సోషల్ మీడియాలో పరిచయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ఫిలిప్ క్రిస్టల్ పద్ధతి, టీ-సేఫ్ యాప్ వినియోగం, వాటి ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ సుమలత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మొత్తం 420 మంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

