ఆదిలాబాదు,జిల్లాలో పకడ్బందీగా 'అగ్రిస్టాక్' అమలు, రైతుల సేవల్లో పారదర్శకతే లక్ష్యం*...జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 6 (విజన్ ఆంధ్ర)వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి, రైతులకు ప్రభుత్వ పథకాలు, సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు ఉద్దేశించిన 'అగ్రిస్టాక్' ప్రాజెక్టును జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ సమావేశం మందిరంలో అగ్రిస్టాక్ అమలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంపై ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలిక డేటా నాణ్యతను మెరుగుపరచడం, భూ రికార్డులను సమగ్రంగా అనుసంధానం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఫార్మర్ రిజిస్ట్రీ అప్‌డేషన్, జియో-రిఫరెన్స్డ్ భూ రికార్డులతో డిజిటల్ క్రాప్ సర్వేను పక్కాగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో వంద శాతం డిజిటల్ క్రాప్ సర్వే పూర్తయిందని, సాంకేతిక సమస్యలు ఉన్నచోట తప్పుల సవరణ, మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆధార్ లింకింగ్, ఈ-కేవైసీ, ఓటీపీ సమస్యల వల్ల రైతుల నమోదులో వస్తున్న ఆటంకాలను వేగంగా పరిష్కరించి, ధ్రువీకరించిన ఫార్మర్ ఐడీ ద్వారా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలన్నారు. సొంత భూమి లేని కౌలు రైతులకు, నాన్-డీఎస్  రైతులకు ఎదురవుతున్న గుర్తింపు సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రిస్టాక్ డేటా ఆధారంగా పంటల బీమా, మార్కెట్ సదుపాయాలు, లాజిస్టిక్స్ రైతులకు వ్యవసాయ రుణాలు సులభంగా అందేలా కన్సెంట్-బేస్డ్ డిజిటల్ విధానాలను రూపొందించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను నవంబర్ 5 వ తేదీలోగా ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. సంబంధిత ప్రతిపాదనలు, టాస్క్‌ఫోర్స్ డాక్యుమెంట్లను అగ్రిస్టాక్ పోర్టల్‌లో నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం విధిగా అప్‌లోడ్ చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీఎంవో అధికారి గజానన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, డీహెచ్ఎస్వో సందీప్, మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, సీపీవో వెంకట రమణ, ఇంచార్జి వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, టెక్నికల్ ఏవో విశ్వామిత్ర, విశ్వనాథ్, ఈడియం రవి, 
సైంటిస్ట్ శ్రీధర్ చౌహాన్, రామ్ గోపాల్ వర్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News