యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన
తాడిచర్ల రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో ఆర్‌పీఎల్ శిక్షణ - 50 శాతం రాయితీపై సూడోమోనాస్ పంపిణీ
మల్హర్ : మల్హర్ రావు మండలంలోని తాడిచర్ల రైతు వేదికలో ఆత్మ (ATMA) ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు ఆర్‌పీఎల్ (RPL) శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చే యాసంగి సీజన్‌లో వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి శ్రీజ మాట్లాడుతూ.. వచ్చే యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. వరి సాగును తగ్గించి, నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యంగా కూరగాయలు, నూనెగింజల పంటల సాగు ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు.అనంతరం పంటల్లో తెగుళ్ల నివారణకు ఉపయోగపడే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్‌ను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో తాడిచర్ల గ్రామ సర్పంచ్, మండల వ్యవసాయ అధికారిణి శ్రీజ, వ్యవసాయ విస్తరణ అధికారులు పృథ్వీరాజ్, సుమంత్, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


