దసరాలోపు యాదాద్రి థర్మల్ కేంద్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి-ముఖ్యమంత్రి
హైదరాబాద్: దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి G-9 గ్రేడ్ బొగ్గు అవసరమని అధికారులు వివరించారు. అయితే సింగరేణి కాలరీస్‌లో ప్రస్తుతం G-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులో కూడా ఈ గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం లేదని తెలిపారు.G-9 గ్రేడ్ బొగ్గు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆ సాంకేతికతపై ఆధారపడి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎలా నిర్మించారని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అలాగే బొగ్గు గనులకు సమీపంలో పిట్‌హెడ్ పవర్ ప్లాంట్‌గా నిర్మించకుండా, యాదాద్రి కేంద్రాన్ని దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ.40 వేల కోట్ల అదనపు భారం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంపై సుమారు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు సమావేశంలో వివరించినట్లు సమాచారం.గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల G-9 గ్రేడ్ బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని కూడా సమావేశంలో వెల్లడించారు.
కేంద్ర బొగ్గు మంత్రితో చర్చించాలని ఆదేశం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన G-9 గ్రేడ్ బొగ్గు అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో తక్షణమే చర్చించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి సూచించారు.ప్రస్తుత రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పంపులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సింగరేణి కాలరీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About The Author


