ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు వినతి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోందని వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బుదవారం వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, పంట మార్పిడిపై రైతులకు కల్పిస్తున్న అవగాహన వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు వరి, పత్తి వంటి పంటలకు బదులుగా ఫామ్ ఆయిల్ సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అధిక స్థాయిలో పంట సాగవుతోందని, రాబోయే రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఫామ్ ఆయిల్ గెలలు నరికిన వెంటనే 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుందని, సమయం దాటితే పంట నాణ్యత తగ్గి రైతులకు నష్టం జరుగుతుందని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉంటే రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని వివరించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


