బాస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు!
అన్నంలో వెంట్రుకలు, రాళ్లు, నాసిరకం బియ్యం.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా? ఎంఈఓ పర్యవేక్షణలోనే ఇలాంటి పరిస్థితులా? ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి: ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్
హుస్నాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం, అన్నంలో వెంట్రుకలు, రాళ్లు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాచూరి యుగంధర్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మన బడి,మన హక్కు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ఏఐఎస్ఎఫ్ నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజన నాణ్యతపై వివరాలు సేకరించారు.నిన్న మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నంలో పురుగు కనిపించడంతో భయపడి భోజనాన్ని పారవేసినట్లు ఒక విద్యార్థిని నాయకులకు తెలిపిందన్నారు.ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలు కూడా ఉన్నాయని,ఇతర విద్యార్థులను భోజనం నాణ్యత గురించి ప్రశ్నించగా,అన్నంలో తరచూ వెంట్రుకలు,రాళ్లు, పురుగులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సరఫరా అవుతున్న బియ్యంలో సుమారు 40 శాతం వరకు నూకలు ఉంటున్నాయని విద్యార్థులు వెల్లడించారు.
ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే కోహెడ మండల విద్యాశాఖ అధికారి బాస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు.
అలాంటి పరిస్థితుల్లో అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై ఇన్ని ఫిర్యాదులు రావడం పాఠశాల పర్యవేక్షణ, బాధ్యతల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలోని పాఠశాలల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి తాను ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాఠశాలలోనే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన అవసరం లేదా? ఒక పాఠశాలలోనే ఈ పరిస్థితి ఉంటే కోహెడ మండలంలోని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పరిస్థితి ఎలా ఉందో ఉన్నతాధికారులు సమీక్షించాలని కోరారు.
బస్వాపూర్ పాఠశాలలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, బియ్యం నాణ్యతను అధికారికంగా పరీక్షించాలని,విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేయాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని యుగేందర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోహెడ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మధ్యాహ్న భోజన నాణ్యతను నిర్ధారించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని ఏఐఎస్ఎఫ్ సహించబోదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కోహెడ మండల కార్యదర్శి కందుకూరి మహేష్, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


