మల్లంపల్లికి పీహెచ్‌సీ ఎందుకు లేదు? కొడంగల్‌కు ఒక న్యాయం.. మల్లంపల్లికి మరో న్యాయమా?e
మల్లంపల్లికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని లక్ష్మణ్ బాబు డిమాండ్
మల్లంపల్లి : కొడంగల్ నియోజకవర్గంలోని హాకింపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మల్లంపల్లి మండలంలో చర్చ మొదలైంది. హాకింపేటకు పీహెచ్‌సీ ఏర్పాటు చేస్తున్నప్పుడు మల్లంపల్లికి ఎందుకు మంజూరు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ బాబు ప్రశ్నించారు.
మల్లంపల్లి మండలంగా ఏర్పడి చాలాకాలం గడుస్తున్నా, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.మండల కేంద్రంగా ఉన్న మల్లంపల్లిలోనే పూర్తిస్థాయి ప్రభుత్వ వైద్య సదుపాయాలు లేకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, అత్యవసర వైద్యం అవసరమైన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి!
హాకింపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న ప్రారంభించారు. అదే తరహాలో మల్లంపల్లి మండల ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి ఇక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. మల్లంపల్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి పీహెచ్‌సీ మంజూరు చేయాలని ఆయన కోరారు.మల్లంపల్లికి కూడా వైద్య సదుపాయాలు కల్పిస్తారా? లేక ప్రజల ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


