రేకొండలో పిచ్చి కుక్కల దాడి- సర్పంచ్ సహా పలువురికి గాయాలు
భయాందోళనలో గ్రామస్థులు
చిగురుమామిడి : గ్రామ ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్నాయని సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లిన సర్పంచ్ పై సైతం కుక్కలు దాడి చేసిన సంఘటన చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తూ గ్రామస్థులపై విరుచుకుపడ్డాయి. గ్రామంలో ఒక్కసారిగా చెలరేగిన కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో గ్రామ సర్పంచ్ అల్లేపు సంపత్‌తో పాటు దుడ్డేల రాజవ్వ,దుడ్డేల బుధవ్వ సహా మరో నలుగురు గ్రామస్థులు ఉన్నారు.రహదారులపై వెళ్తున్న వారిని, ఇళ్ల ముందు ఉన్న వారిని కుక్కలు వెంటాడి వేటాడటంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కుక్కల దాడిలో గాయపడిన బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారు అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.గ్రామంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం,అవి పిచ్చిగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడులకు తెగబడుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు.కుక్కను పట్టుకునే క్రమంలో గ్రామస్థుల దాడిలో కుక్క మృతి చెందింది. గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు,జిల్లా పంచాయతీ యంత్రాంగం తక్షణమే స్పందించి,గ్రామంలో కుక్కల బెడద నివారణకు తగిన చర్యలు చేపట్టాలని,వీధుల్లో తిరుగుతున్న కుక్కలను నియంత్రించి తమకు రక్షణ కల్పించాలని రేకొండ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

