ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు.
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులపై అధికారులు తక్షణమే స్పందించాలని, పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26 ఫిర్యాదులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 19, ఇతర శాఖలకు సంబంధించి 7 దరఖాస్తులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్ర రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


