అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గజసింగవరంలోనిగర్భిణులకు సామూహిక సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం గజసింగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల పేరిట కార్యక్ర మాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తున్నామని, కేంద్రాల్లో సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్థ తీవ్ర పోషకాహార లోపం, తీవ్రమైన తక్కువ బరువు, మధ్యస్థ తక్కువ బరువు ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తారని వివరించారు.
బాలామృతం ప్లస్ తో పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి ఇవ్వాలని తెలిపారు. నీరు వేడి చేసి చల్లారిన తర్వాత ఇవ్వాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. పిల్లల ఆరోగ్యం, చదువు భవిష్యత్తు తల్లితండ్రుల ఇద్దరి బాధ్యతని పేర్కొన్నారు.గర్భిణులు బాలింతలు మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు, సరిగా మాట్లాడలేని పిల్లలు, రక్తహీనత, పోషకాహారం లోపం గల పిల్లలను బాల భరోసా కింద అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి ..ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. సేవలను సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఉన్నత వైద్య సేవలు కరీంనగర్, హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

