అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా
* నవంబర్ 19న సిద్దిపేట లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం * సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం * సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు పొన్నం, వివేక్
సంగారెడ్డి డెస్క్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈనెల 19 వ తేదీన సిద్దిపేట లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో సిద్దిపేట లో సభ స్థలి కోసం పలు ప్రాంతాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి లు తూంకుట నర్సారెడ్డి, పూజల హరికృష్ణ, చెరువు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, నూతన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే సభ ప్రధాన లక్ష్యం అన్నారు. నవంబర్ 19న సిద్దిపేట సభ వేదికగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, చిలుక పచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వాని ది అన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్న మూడు సంవత్సరాల కాలంలో 2వందల యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు రూ.5వందల బోనస్, రుణ మాఫీ, రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల కు పెంపు, ఉద్యోగ నియామకాలు, పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణం తదితర కార్యక్రమాలను విజయ వంతంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సిద్దిపేట సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 19న సిద్దిపేటలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


