పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంకురి నాగార్జున.
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా 13 మంది సభ్యులతో నామినేటెడ్ పద్ధతిలో నియమించడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర నాయకులు డాక్టర్ అంకురి నాగార్జున తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంకూరి నాగార్జున మాట్లాడుతూ.. పీఏసీఎస్‌లు రైతుల సొంత సంస్థలు.. ఇప్పటివరకు సభ్యులైన రైతులే ఓటు వేసి డైరెక్టర్లను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఇప్పుడు "పునర్వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉంది" అనే సాకుతో ఎన్నికలను పక్కనపెట్టి, ఎమ్మెల్యే సిఫారసుల మేరకే పదవులు కట్టబెట్టడం రైతుల ఓటు హక్కును కాలరాయడమే అని విమర్శించారు. ఒక్క ఎమ్మెల్యే నిర్ణయంతో వేలాది మంది రైతుల ప్రతినిధులు ఎలా ఎంపికవుతారని ప్రశ్నించారు. సహకార సంఘాలు ఒక పార్టీకో, ఒక నాయకుడికో సొంతం కాదు అని డాక్టర్
అంకూరి నాగార్జున స్పష్టం చేశారు. పిఎసిఎస్ పాలకమండలిలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ఇంతవరకు సమంజసం అని నిలదీశారు. బహుజన రైతులకు అన్యాయం చేసి ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పాలకమండలి ఏర్పాటుచేసి ఊరుకొండ మండలానికి ఒక్క పదవి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపడం రైతన్నలను అవమానపరచడమేనని నిలదీశారు.
మెజారిటీ వర్గాలకు సమాన వాటా ఎక్కడ..?
జీవోలో నియమించిన 13 మంది సభ్యుల జాబితాను పరిశీలిస్తే., చైర్‌పర్సన్‌తో సహా 6 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారే. అంటే దాదాపు సగం పదవులు, అత్యున్నతమైన చైర్పర్సన్ పదవి కూడా ఒకే వర్గానికి దక్కాయి. నియోజకవర్గంలో వ్యవసాయం చేసే రైతుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే అని స్పష్టం చేశారు. అలాంటప్పుడు జనాభా దామాషా ప్రకారం మెజారిటీ వర్గాలకు దక్కాల్సిన వాటా ఎక్కడ..? ఒకే వర్గానికి ఎక్కువ పదవులు ఎందుకు..? మిగతా వర్గాల రైతులు పదవులకు అర్హులు కారా..? "ఎవరి జనాభా ఎంతో, వారికి అంత వాటా" అనేదే బీఎస్పీ సిద్ధాంతం అని అన్నారు. బహుజన రైతులకు నామమాత్రపు ప్రాతినిధ్యం ఇచ్చి సరిపెట్టడం సామాజిక న్యాయానికి విరుద్ధం అని ఆయన మండిపడ్డారు.
ఊర్కొండ మండల పిఎసిఎస్ భాగస్వామ్యం ఎక్కడ..?
కల్వకుర్తి పీఏసీఎస్‌లోని మొత్తం 13 డైరెక్టర్ స్థానాల్లో ఊర్కొండ మండలానికి 5 స్థానాలు ఉన్నాయి.. అయినా కొత్త పాలకమండలిలో ఊర్కొండకు ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడం ఆ మండల రైతులను పూర్తిగా విస్మరించడమేనని ఆరోపించారు. ఊర్కొండ రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అవసరం లేదా..? వారి గొంతు పాలకమండలిలో వినిపించే అవకాశం ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు.
నామినేటెడ్ పదవుల విషయంలో అధికార పార్టీలోనే అసంతృప్తి బయటపడుతోందని విమర్శించారు. ఈ ప్రక్రియ ఎంత అపారదర్శకంగా జరిగిందో అర్థమవుతోందని వాపోయారు. ఇది రైతుల సేవ కోసం కాదు, రాజకీయ పునరావాసం కోసమేనని ఆయన విమర్శించారు.
బీఎస్పీ డిమాండ్లు..
పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పద్ధతిని రద్దు చేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుత పాలకమండలిని పునర్వ్యవస్థీకరించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రైతులకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఊర్కొండ మండలానికి దాని వాటా 5 డైరెక్టర్ స్థానాలు తక్షణమే కల్పించాలన్నారు. నియామక ప్రక్రియ, ఎంపిక ప్రమాణాలను ప్రజల ముందు బహిరంగంగా ఉంచాలని. ఇట్టి డిమాండ్లు నెరవేరకపోతే రైతులతో కలిసి బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని డాక్టర్ అంకురి నాగార్జున హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


