గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు!
నిజామాబాద్ : జిల్లాలోని గడ్కోల్ గ్రామం నుంచి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గౌడ్ రాచకొండకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆయనను ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో ఎంపిక చేసినట్లు వైట్ పేజ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది.
దుబాయ్‌లో కార్యకలాపాలు..
దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెన్సా ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) శ్రీనివాస్ గౌడ్ రాచకొండను ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో ఎంపిక చేశారు. గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్, మల్టీ ఫ్యామిలీ ఆఫీస్ అడ్వైజరీ, సామాజిక ప్రభావ నాయకత్వం వంటి రంగాల్లో ఆయన సాధించిన విజయాలను గుర్తిస్తూ సంస్థ ఈ గౌరవాన్నిచ్చింది.
పల్లె నుంచి అంతర్జాతీయ ఆర్థిక రంగానికి..
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ రాచకొండ ప్రస్థానం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి తన కృషి, పట్టుదలతో అంతర్జాతీయ బ్యాంకింగ్, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బ్యాంకింగ్, సంపద నిర్వహణ, ఆర్థిక సేవల రంగాల్లో సుమారు 25 ఏళ్ల అనుభవం కలిగిన ఆయన యూబీఎస్ (UBS), సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, ఐసీఐసీఐ (ICICI), మష్రెక్ ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ అనుభవంతో 2022లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో మెన్సా ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. 2023లో దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) నుంచి నియంత్రణ అనుమతి పొందిన ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ ఖాతాదారులకు సంపద నిర్వహణ, పెట్టుబడుల సలహాలు, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారు.
గతంలోనూ అంతర్జాతీయ గుర్తింపులు..
శ్రీనివాస్ గౌడ్ రాచకొండ వృత్తిపరమైన నాయకత్వానికి గతంలోనూ గుర్తింపు లభించింది. 2024లో ఇండియా టుడే గ్రూప్, ఆజ్ తక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ‘ఐకాన్స్ ఆఫ్ ది యూఏఈ’ గుర్తింపును అందుకున్నారు. అలాగే మెన్సా ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ సంస్థకు 2024, 2025, 2026 సంవత్సరాల్లో సిటీవైర్ మిడిట్ ఈస్ట్ నుంచి గుర్తింపు లభించినట్లు వైట్ పేజ్ ఇంటర్నేషనల్ తన ప్రకటనలో పేర్కొంది. జన్మభూమి రుణం తీర్చుకునే దిశగా.. అంతర్జాతీయ స్థాయిలో వృత్తిపరమైన విజయాలు సాధించినప్పటికీ తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని, గ్రామీణ సమాజాన్ని మరచిపోకుండా శ్రీనివాస్ గౌడ్ సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025 అక్టోబర్‌లో ‘సస్టైనబుల్ రూరల్ ఇనిషియేటివ్స్ ఫర్ నర్చరింగ్ ఇండియా’ పేరుతో సామాజిక సేవా సంస్థను స్థాపించారు. ‘గ్రాస్‌రూట్స్ టు రైజ్’ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సాధికారత లక్ష్యంగా ఈ సంస్థ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే గడ్కోల్ గ్రామంలో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించడంతో పాటు అన్నదానం, చిన్న తరహా ఉపాధి అవకాశాల కల్పన వంటి సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తన తండ్రి శ్రీని ఫౌండేషన్ అధ్యక్షుడు దేవా గౌడ్ రాచకొండ, సతీమణి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక సహకారంతో గ్రామీణ కుటుంబాల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో శ్రీనివాస్ గౌడ్ ఫౌండేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


