రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఏసీపీ కిరణ్ కుమార్
బెల్లంపల్లి, : రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని నేరాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం బెల్లంపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గతంలో వివిధ నేరాలకు పాల్పడిన వారు ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. గొడవలు, దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కుటుంబ బాధ్యతలను గుర్తిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


