ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు. డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం పేరుతో మాట్లాడేవారు ముందుగా చట్టాన్ని గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ విలువలు కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని తెలిపారు. స్పీకర్ వద్ద తప్పించుకుంటాననే ధీమా వదిలేయాలని, ఇప్పటికే హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమని న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రాజయ్య తెలిపారు. . ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, బాలరాజు, పొన్న రాజేష్, చల్లా చందర్ రెడ్డి, మారెపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


