మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్ లోని ప్రైవేట్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత జీవితాలను, బంగారు భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని అన్నారు. ప్రస్తుత కాలంలో యువత తెలియక, స్నేహితుల ప్రోద్బలంతో డ్రగ్స్ బారిన పడుతున్నారని, అది వారి ఆరోగ్యంతో పాటు కుటుంబాలకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడే సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులు పట్టణంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సునేంద్ర కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


