కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పటాన్‌చెరు, : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పటాన్‌చెరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు అందుతున్న ఆర్థిక సహాయంపై మాట్లాడారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారుతుందని, ఆ భారాన్ని కొంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, వివాహ సమయంలో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందనే భరోసా కల్పించిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభ సమయంలో రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సహాయం అనంతరం రూ.75,116కు, ఆ తర్వాత రూ.1,00,116కు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా అనేక పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తులం బంగారం పేరుతో హామీలు ఇచ్చి ప్రజల్లో ఆశలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆడబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక అండగా, తల్లిదండ్రులకు భరోసాగా నిలిచేలా పథకాన్ని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, ఎంపీపీ యాదగిరి, పృథ్వీరాజ్, నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


