సింగరేణి ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపెయిన్-6లో భాగంగా స్వచ్ఛ పకోడా కార్యక్రమం
స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజ
కొత్తగూడెం : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్-6లో భాగంగా ఏరియా వర్క్‌షాప్‌లో స్వచ్ఛ పకోడా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్క్‌షాప్ హెచ్‌ఓడీ, డీజీఎం జే. క్రిస్టఫర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు, అప్రెంటిస్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్ ఇంజనీర్లు బి. శంకర్, టీ. అనిల్, ఐఎన్‌టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి. సత్తార్ పాషా, సూపర్‌వైజర్లు యు. రమేష్ బాబు, తారాచంద్, ఎస్.డి. యాకూబుద్దీన్, మెంగని అశోక్, కరుణాకర్ తదితరులతో పాటు వర్క్‌షాప్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిస్‌లు, డీఎల్‌ఆర్ కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా సమర్థవంతంగా సేకరించి, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి 100 గంటలు, అంటే ప్రతిరోజూ సుమారు 2 గంటల చొప్పున శ్రమదానం చేసేందుకు సమయం కేటాయిస్తే సమాజంలో పరిశుభ్రతపై మరింత అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. వీధి వీధికి.. గ్రామ గ్రామానికి స్వచ్ఛతను విస్తరించేందుకు, స్వచ్ఛ తెలంగాణ–స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములమవుతామని కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛతను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


