నకిలీ పత్రాలతో భూమిని లేఅవుట్‌లో కలిపి ప్లాట్ల విక్రయం
- భూమి యజమానిని మోసం చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
- మావల సిఐ బి డి ప్రేమ్ కుమార్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, లేఅవుట్‌లో కలిపి ప్లాట్లు విక్రయించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. బ్రహ్మణవాడకు చెందిన స్నేహ దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యుల భూమికి సంబంధించి ఈ వివాదం చోటుచేసుకుంది. ఆమె మేనమామ హర్బాజీ దేశ్‌ముఖ్ 1971లో బట్టిసావర్గాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 63లో 5 ఎకరాల 23 గుంటల భూమిని పోతన వద్ద నుంచి రూ.12,వేలకు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే 1992లో పేద్దిరి శివారెడ్డి కుమారుడు పేద్దిరి పోతారెడ్డి సదరు భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని లేఅవుట్‌లో కలిపి అక్రమంగా ప్లాట్లుగా అభివృద్ధి చేసి ఇతరులకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయం 2000 సంవత్సరంలో తనకు తెలిసినప్పటికీ, సదరు వ్యక్తి పరిహారం చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో అప్పట్లో చట్టపరమైన చర్యలకు ఫిర్యాదుదారు ముందుకు రాలేదని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పరిహారం చెల్లించకపోవడంతో ఇటీవల డబ్బుల విషయమై సంప్రదించగా, చెల్లించేది లేదని చెబుతూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్.672/2026 యు/సెక్షన్ 420, 467, 468, 471, 506 ఐ పి సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


