జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
పటాన్చెరువు : సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ, ఆరోగ్య, నివాస భద్రత కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించా లని, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆరోగ్య సదుపాయాలు అందేలా ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం తగిన వేతన విధానాన్ని అమలు చేయాలని, పని గంటలు, సెలవులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మెట్టు శ్రీధర్ కోరారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన పరిష్కారాలు చూపకపోతే జర్నలిస్టు సంఘాలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మెట్టు శ్రీధర్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


