మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో వృథాగా పోతున్న నీరు
పైపులైన్ కోసం తవ్వి వదిలేయడంతో వాహనదారులు, గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు
ఫత్లాపూర్,: ఎన్‌హెచ్–161 సర్వీస్ రోడ్డులోని ఫత్లాపూర్ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ సమస్య స్థానికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కోసం రోడ్డుపక్కన పెద్దఎత్తున మట్టిని తవ్వి పనులు చేపట్టినప్పటికీ, పనులు పూర్తిచేయకుండా అలాగే వదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. పైప్‌లైన్ నుంచి నీరు నిరంతరం లీక్ అవుతూ రోడ్డుపైకి చేరడంతో నీరు వృథాగా పోతున్నది. మరోవైపు తవ్విన మట్టితో సర్వీస్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపై మట్టి, బురద పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడిన సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి, తవ్విన ప్రాంతాన్ని పూడ్చి రోడ్డును సక్రమంగా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
నీటి వృథాను అరికట్టి, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఫత్లాపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


