వడ్ల కొనుగోళ్లలో రైతుల దోపిడీపై సమగ్ర విచారణ చేయాలి

వడ్ల కొనుగోళ్లలో రైతుల దోపిడీపై సమగ్ర విచారణ చేయాలి

  • మిల్లర్లపై విజిలెన్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలి
  • రైతుల నుంచి బస్తాల కొద్దీ కటింగ్‌పై గ్రామాల వారీగా విచారణ జరపాలి
  • రైతు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి

అక్కన్నపేట, : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన యాసంగి ధాన్యంలో మిల్లర్లు అక్రమం గా కోతలు విధించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 2026 ఏప్రిల్, మే నెలల్లో జరిగిన యాసంగి ధాన్యం ప్రభుత్వ కొనుగోళ్లలో హుస్నాబాద్ ప్రాంతంలోని పలువురు రైతుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు ఐదు నుంచి పది బస్తాల వరకు మిల్లర్లు కటింగ్ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాలు, నూకలు, ధాన్యం నాణ్యత పేరుతో రైతుల నుంచి అధికంగా కోతలు విధించినట్లు వచ్చిన ఫిర్యాదులపై గ్రామాల వారీగా విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు కాంటాలు వేసిన పరిమాణానికి పూర్తిస్థాయి చిట్టీ ఇవ్వకుండా, మిల్లర్లతో మాట్లాడుకోవాలని రైతులను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులు తమ ధాన్యానికి కనీస మద్దతు ధర లభిస్తుందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే, మిల్లుల వద్దకు వెళ్లిన తర్వాత బస్తాల కొద్దీ కోతలు విధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గత యాసంగిలో జరిగినట్లు చెబుతున్న ఈ కోతలపై జిల్లా కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారులకు గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2024లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొన్ని మిల్లులు ప్రభుత్వానికి బిల్లింగ్ చేయకుండా పక్క రాష్ట్రాలకు తరలించి విక్రయించారనే ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ అంశంపై 2024 జనవరి 24న రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల నేపథ్యంలో 2024 మార్చి 19న విజిలెన్స్ ఎస్పీ, పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులను తనిఖీ చేసినప్పటికీ, తదుపరి చర్యలు ఏమయ్యాయనే దానిపై స్పష్టత లేదని అన్నారు. ఆ విచారణను తిరిగి కొనసాగించి, ధాన్యం పక్కదారి పట్టిందా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం, ధాన్యం నిల్వలు ఏమయ్యాయి? అనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో రైతులకు నష్టం కలిగించే విధంగా అక్రమాలు జరిగితే వాటికి బాధ్యులైన మిల్లర్లు, సంబంధిత అధికారులు ఎవరైనా సరే చర్యలకు గురికావాల్సిందేనని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలను పక్కనపెట్టి ప్రతి సంవత్సరం ప్రభుత్వ కొనుగోళ్ల సమయంలో రైతులు నష్టపోయే పరిస్థితి కొనసాగడం సరికాదన్నారు. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు రైస్ మిల్లుల్లో గతంలో మిల్లింగ్ చేసిన బియ్యం ప్రభుత్వానికి అందించకుండా పక్కదారి పట్టించిన అంశాలపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో హుస్నాబాద్ ప్రాంతంలోని మిల్లులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గత యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, మిల్లులకు తరలించిన ధాన్యం, మిల్లుల్లో నమోదైన వివరాలు, రైతులకు ఇచ్చిన చిట్టీలు, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి అందించిన బియ్యం వివరాలను గ్రామాల వారీగా సరిపోల్చి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖకు మరోసారి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణకు కోరనున్నట్లు రైతు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి అక్రమంగా కోతలు విధించినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం