గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి.
ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
సంగారెడ్డి :గాంధీ జయంతి సందర్భంగా జాతీయ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. మీడియా రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విధాన సిఫారసులు చేసేందుకు సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, వార్తా సంస్థలను దాడులు, బెదిరింపులు, అణచివేత నుంచి రక్షించేందుకు ప్రత్యేక కేంద్ర చట్టం తీసుకురావాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన 1955, 1958 చట్టాల నిబంధనలను పునరుద్ధరించి ఉద్యోగ భద్రత, పని గంటల పరిమితి, వివాదాల పరిష్కారం, ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఉద్యోగులకు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు అందించేందుకు కొత్త వేతన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, సంగారెడ్డి జిల్లాలోనూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు స్థలం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య సేవలను పునరుద్ధరించి, తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రిడిటేషన్ కార్డులు అందని అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వాలు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకుడు జోగిపేట యాదగిరి, వెంకటరెడ్డి, సంఘం జిల్లా కోశాధికారి అన్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, శ్రీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, ఉలవల రాజు, అంజయ్య, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, సుమన్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, సీనియర్ జర్నలిస్టు మధుసూదనాచారి, రథసారథి సీఈవో సంతోష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయరాజు, పరంజ్యోతి, నాగరాజుగౌడ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, ఇతర నేతలు పవన్ ,సంతోష్, సత్యం, సాక్ష్యం శ్రీనివాస్, నవీన్, పటాన్చెరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పత్తి నరసింహ ప్రధాన కార్యదర్శి యాదగిరి, బొల్లారం నాయుడు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


