ఒంటరి మహిళా రైతులకు ఆయిల్‌పామ్ అండ
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఒంటరి మహిళా రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు ప్రోత్సహించి, వారికి స్థిరమైన ఆదాయం కల్పించడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హార్టికల్చర్ శాఖ ద్వారా ఆయిల్‌పామ్ మొక్కలు, అంతర పంటలు, డ్రిప్ పరికరాల కోసం నాలుగేళ్లకు ఎకరానికి రూ.16,800 రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు వాటాగా చెల్లించాల్సిన మొత్తం, అదనపు సాగు వ్యయాన్ని ప్రత్యేక సహాయం కింద జిల్లా యంత్రాంగం భరించనున్నట్లు తెలిపారు. భర్తను కోల్పోయిన లేదా ఇతర కారణాలతో ఒంటరిగా జీవిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన మహిళా రైతులు, 1 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న వారు ఈ అదనపు ఆర్థిక సహాయానికి అర్హులని వివరించారు. అర్హులు గ్రామస్థాయిలోని హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ఆయిల్‌పామ్ ఫీల్డ్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా లేదా ఐడీఓసీలోని జిల్లా హార్టికల్చర్ అధికారి కార్యాలయంలోనూ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆయిల్‌పామ్ తోటలు పక్వానికి వచ్చే తొలి నాలుగేళ్లలో అంతర పంటలుగా కూరగాయలు తదితర పంటలు సాగు చేసుకోవడం ద్వారా తరచూ ఆదాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమైన అనంతరం ఎకరానికి ఏటా సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. మహిళా రైతులు తమకున్న భూమిని సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటలు సాగు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందాలన్నదే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


