దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి

దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి

అక్కన్నపేట,: స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన కమ్యూనిస్టులను నిజాం సర్కారు అణచివేసి, వేలాది మంది పోరాట యోధులను పొట్టన పెట్టుకుందని ఎంసీపీఐ(సి) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దేశ ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతర ప్రజా పోరాటాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. వెట్టిచాకిరీ, బానిసత్వం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎర్రజెండా చేతబట్టి పోరాటం సాగించారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తుపాకులు, వడిసెల రాళ్లు, కత్తులు, కారం పొడి, రోకలి బండలు, గుత్తులు వంటి అందుబాటులో ఉన్న సాధనాలతోనే నిరంకుశ పాలనను ఎదురించి ప్రజా యుద్ధం సాగించారని తెలిపారు. ఈ పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పేదల భూమి, ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం త్యాగాలు చేశారని అన్నారు.

 లక్షలాది ఎకరాల భూమి కోసం పోరాటం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిరుపేదలకు లక్షలాది ఎకరాల భూమి అందించేందుకు కమ్యూనిస్టులు పోరాడారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులు, కూలీలకు భూమి, కూడు, గూడు కోసం సాగిన ఆ పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సర్కారు తీవ్ర నిర్బంధానికి పాల్పడిందని, అనంతరం జరిగిన సైనిక చర్యల్లో కూడా వేలాది మంది కమ్యూనిస్టు పోరాట యోధులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు విలీన దినోత్సవమే సరైన నివాళి అని ఆయన అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

రాజ్యాంగ ఫలాలు పేదలకు చేరాలి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఫలాలు పూర్తిస్థాయిలో పేదల దరిచేరడం లేదని లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ సంపదలో అధిక భాగం కొద్దిమంది పెట్టుబడిదారులు, బడాబాబుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని ఆయన ఆరోపించారు.దేశ సంపదను దోచుకుంటున్న బడాబాబుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు, యువత ఐక్యంగా ప్రజా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. పేదలు, కార్మికులు, రైతులు, కూలీల హక్కుల సాధన కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కార్యక్రమంలో ఎంసీపీఐ(సి) నాయకులు పాపన్న, శ్రీనివాస్ రెడ్డి, కంసాని శ్రీనివాస్ రెడ్డి, లింగాల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. 

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు కుంకుమ పూజకు తరలివచ్చిన మహిళలు
టూ టౌన్ పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉత్సాహంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు అధిక సంఖ్యలో హాజరైన మహిళలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ...
విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు
మర్రిగూడ మండలంలో విషాదం.
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు