పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
- సాఫ్ట్‌వేర్ లోపాలతో పెన్షనర్లను వేధించడం ఆపాలి
- రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లు, CPS ఉద్యోగులందరికీ EHS కార్డులు ఇవ్వాలి
- అప్లోడింగ్, రిజెక్షన్, ఎడిట్ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలి
అక్కన్నపేట : పెన్షనర్ల నూతన EHS హెల్త్ కార్డుల కోసం వివరాలు అప్లోడ్ చేసే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు ప్రభుత్వం తక్షణమే చెక్ పెట్టాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు కూడా EHS హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రిటైర్డ్ అయిన CPS ఉద్యోగులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా EHS కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ సభ్యుల వివరాలను అప్లోడ్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతున్న సమస్యలతో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా అర్హులైన కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా నమోదు చేసి ఆమోదించే విధంగా EHS సాఫ్ట్‌వేర్‌ను సరళతరం చేయాలని కోరారు. కార్డు డౌన్‌లోడ్ చేసిన అనంతరం ఫొటో లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేలా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మహిళా సర్వీస్ పెన్షనర్ల భర్త వివరాలను నమోదు చేసే సమయంలో వయస్సు నిబంధనల కారణంగా దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్న సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా స్పౌజ్ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని EHS కార్డుల ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అన్నారు. సాంకేతిక లోపాల కారణంగా అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవలకు దూరం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు, రిటైర్డ్ CPS ఉద్యోగులందరికీ సమాన వైద్య భద్రత కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, EHS కార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


