విద్యార్థులపై దాడి చేసిన పాలిటెక్నిక్ HODపై చర్యలు తీసుకోవాలి: AISB డిమాండ్
నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల EEE హెచ్‌ఓడీ విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడం సిగ్గుచేటని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్ బి) మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ డిమాండ్ చేశారు. శక్తి స్కీం నిరసనల్లో పాల్గొన్నారనే కక్షతో విద్యార్థులకు అదనపు అసైన్‌మెంట్లు ఇచ్చి మానసికంగా వేధించడమే కాకుండా, వారిపై భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం రోజు విద్యార్థులు కళాశాలలో చేపట్టిన మెరుపు నిరసనకు ఏఐఎస్ బి మద్దతు ప్రకటించింది. సమాచారం అందుకున్న పోలీసులు, కళాశాల యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించి నిరసన విరమించారు. గాయపడిన విద్యార్థులకు యాజమాన్యమే మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యుడైన హెచ్‌ఓడీపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని సన్నీ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ బి నాయకుడు ఈశ్వర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


