జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
రెండు ఏటీఎంలలో దగ్ధమైన పరికరాలు.. నగదు పరిస్థితిపై స్పష్టత లేదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ గల్లీలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన రెండు ఏటీఎం కేంద్రాలు పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంల నుంచి పొగలు, మంటలు వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో భవన యజమానికి సమాచారం అందించారు.భవన యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మరింత ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు.ఈ ప్రమాదంలో రెండు ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాలు, ఇతర పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఏటీఎంలలో ఉన్న నగదు కాలిపోయిందా? లేక సురక్షితంగా ఉందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాంకు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది.ఘటనపై జోగిపేట సీఐ అనిల్ కుమార్, సంగారెడ్డి సీఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాల ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.నబ్యాంకు అధికారులు అందించే వివరాల అనంతరం నగదు నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


