డిండి లిఫ్టును రద్దు చేయాలి: నాగర్ కర్నూలులో జేఏసీ సత్యాగ్రహ దీక్ష
నాగర్ కర్నూలు :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, డిండి లిఫ్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని డిండి లిఫ్టు ద్వారా నల్లగొండకు తరలించవద్దని డిమాండ్ చేశారు. రాజోలి బండ, కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం, చంద్రసాగర్, అమ్రాబాద్ లిఫ్టు పనులను చేపట్టాలని కోరారు.బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటాను సాధించాలని, కృష్ణా-భీమా నదులు కలిసే తంగిడి సమీపంలో భారీ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ దీక్షకు రిటైర్డ్ ఉద్యోగులు, ఎర్రవెల్లి తదితర గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు. సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం శశిధర్ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కన్వీనర్ రాఘవాచారి తదితర నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


