అంగన్వాడీ టీచర్‌తో అసభ్య ప్రవర్తనపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం
బాధితురాలికి ఫోన్‌లో పరామర్శించిన ఎంపీ – ఘటనపై విచారం, క్షమాపణలు
నిజామాబాద్ : జగిత్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్‌తో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా స్పందించారు. మహిళా ఉద్యోగి పట్ల అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇటువంటి ఘటనలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని ఎంపీ స్పష్టం చేశారు.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎంపీ అర్వింద్, బాధిత అంగన్వాడీ టీచర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిన పరిణామాల పట్ల తన తరఫున క్షమాపణలు తెలియజేస్తూ, బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అంగన్వాడీ టీచర్‌తో పాటు ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తోటి అంగన్వాడీ టీచర్లను కూడా ఎంపీ అభినందించారు. ఉద్యోగులు తమ విధులను స్వేచ్ఛగా, గౌరవప్రదమైన వాతావరణంలో నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అదేవిధంగా, ఈ వ్యవహారంలో అంగన్వాడీ సూపర్వైజర్‌ను కూడా బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలను ఎంపీ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా మాట్లాడతామని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకనుగుణంగా ఘటనను రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ల దృష్టికి తీసుకెళ్లి పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మహిళా ఉద్యోగుల గౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేశారు. పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఇతరులైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత అంగన్వాడీ టీచర్, తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు ఘటన పట్ల విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కోరిన ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


