నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ఉచిత కంటి వైద్య శిబిరం
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీ శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఆప్తాల్మిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పాత కలెక్టరేట్ భవనంలోని గది నంబర్ 102 లో ఈ శిబిరం నిర్వహించనున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు ఈ శిబిరానికి అర్హులని, మసక చూపుతో బాధపడుతున్న వారికి ప్రత్యేక కంటి పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటిలో క్యాటరాక్ట్ (శుక్లం) ఉన్నవారికి అవసరాన్ని బట్టి మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే వారు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని వాటి రిపోర్టులను వెంట తీసుకురావాలని, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు వంటి గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతితో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ తీసుకురావాలని అధికారులు సూచించారు. ఆపరేషన్ చేయించుకున్న రోగులను నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.ఏదైనా సంచారం కావలసినవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9440876556, 7386940480
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


