ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం హేమమైన చర్య
దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి , రజక సంఘం రాష్ట్ర నాయకులు వెంకటం పేట బాలయ్య
మర్రిగూడ, :తెలంగాణ సాయుధ పోరాట వీరనారి,ప్రజల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ జిల్లా కేంద్రంలో దుండగులు ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని రజక సంఘం రాష్ట్ర నాయకులు వెంకటంపేట బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మొత్తం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్యాల ఐలమ్మ లాంటి త్యాగధనుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని సుపరిపాలన అందిస్తున్నామని చెబుతుంటే, మరోవైపు సమాజంలో అకతాయిలు, అసాంఘిక శక్తులు పెట్రేగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇటీవల గాంధీ జయంతి రోజున సుభలేడులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన మరవకముందే, ఇప్పుడు మెదక్లో ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, త్యాగాలకు ప్రతీకలుగా నిలిచే మహానీయుల విగ్రహాలపై దాడులు చేసే సంస్కృతిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిసిటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా బాధ్యులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలకు తగిన భద్రత కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి అపచార సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, త్యాగాలను అవమానించే చర్యలను రజక సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


