ఆదిలాబాద్లో వైభవంగా బతుకమ్మ సంబురాలు.. మహిళలదే సమాజంలో కీలక పాత్ర: కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు
ఆదిలాబాద్ :తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఇందిరా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల పాఠశాలలో ఎస్సీ, బీసీ, పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. పూలను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సంస్కృతి మన బతుకమ్మ పండుగ సొంతమని, పట్టణాలు, గ్రామాల్లో ఈ వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని ఆయన కొనియాడారు. సమాజంలో కుటుంబ నిర్మాణం నుంచి ప్రతి రంగంలోనూ మహిళలదే కీలక పాత్ర అని, తల్లిగా, బిడ్డగా వారు నిర్వహించే బాధ్యతలు అమూల్యమైనవని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఇలాంటి సాంస్కృతిక వేడుకలను మున్ముందు మరింత ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మహిళలతో కలిసి అతిథులు బతుకమ్మ పాటలకు తన్మయంతో ఆడారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డి.ఆర్.ఓ. స్రవంతి, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గణేష్, మైనారిటీ శాఖ అధికారి కలిం, బిసి, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు సోనియా, సునీత కుమారి, ఇతర అధికారులు, మహిళలు, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


