గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
హన్మకొండ న్యూస్ : హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల/కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గురుకుల, కేజీబీవీ పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్, తరగతి గదులు, డార్మిటరీలు, వంట గదులు, ఆర్వో ప్లాంట్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, తగిన పోషకాలతో కూడిన భోజనం అందించాలని, తాజా కూరగాయలు, నిత్యావసరాలు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. దోమల నివారణకు డార్మిటరీ గదులకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, పరిసరాలు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ టైమ్ టేబుల్ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుని, సొంత గ్రామాలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్లు, ఆన్‌లైన్/మీ ప్రమాణం యాప్ అటెండెన్స్, లాబొరేటరీలను తనిఖీ చేశారు. ఇన్-పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగితో మాట్లాడి వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ విధులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డీఈఓ ఎల్.వి. గిరిరాజు గౌడ్, తహసీల్దార్ కోమి, సర్పంచ్ యాదగిరి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మేఘన, జీసీడీఓ సునీత, ఎంపీడీఓ కిషన్, ఎంఈఓ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపల్ సజన, కేజీబీవీ ప్రత్యేక అధికారి స్రవంతి, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


