తాసిల్దార్ కార్యాలయంలో కూలిన పైకప్పు
తాసిల్దార్ కు తృటిలో తప్పిన ముప్పు
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఘోర ప్రమాదం జరిగింది. తాసిల్దార్ నాగరాజు తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లకు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం యధావిధిగా విధులకు హాజరైన తాసిల్దార్ నాగరాజు తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చున్న గది పైకప్పు సీలింగ్ రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పెచ్చులు ఊడిపడి కంప్యూటర్లపై, కుర్చీలపై, ఇతర సామాగ్రిపై ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దాంతో అక్కడే ఉన్న తాసిల్దార్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది, అధికారిక కార్యక్రమాల పని మీద వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైకప్పు పెచ్చులు ఊడి మీద పడడంతో చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడగలిగామని తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పురాతన కాలం నాటి నిర్మాణం కావడం వల్ల పైకప్పు పెచ్చులు ఊడి కింద పడిపోయి ప్రాణాపాయ స్థితిలో పలు కార్యాలయ సిబ్బంది భయాందోళన మధ్య విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలలో పైకప్పు స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించి తనిఖీలు చేయించాలని పలువురు కోరుతున్నారు. కాటారం మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోకి మార్చాలని మరికొందరు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


