దసరా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ టౌన్-1 సీఐ బి. శ్రీనివాస్ తెలిపారు
నిజామాబాద్ : ఆభరణాల విషయంలో అప్రమత్తత అవసరం..పండుగ సమయంలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ అన్నారు. అవసరానికి మించి ఆభరణాలను ధరించి జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసి తాళాలు వేయాలని.. ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఉంచకూడదని పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో వీలైతే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచాలి. అవసరమైతే బ్యాంకు లాకర్లను వినియోగించుకోవాలి. వాహనాల భద్రత..ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా తాళాలు వేసి, హెల్మెట్లు, బ్యాగులు, ఇతర విలువైన వస్తువులను వాహనాల్లో వదిలి వెళ్లకూడదని సీఐ తెలిపారు. దసరా ఉత్సవాలు, దేవాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పర్సులు, మొబైల్ ఫోన్లు, నగలు భద్రంగా ఉంచుకోవాలని.. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగ వేడుకలకు పిల్లలను తీసుకెళ్లేటప్పుడు వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని.. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా అప్రమత్తంగా చూసుకోవాలని వివరించారు.డిజిటల్ లావాదేవీలు..ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు అపరిచితుల సహాయం తీసుకోకూడదని.. ఏటీఎం పిన్, ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని సీఐ తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ ఆఫర్లు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112ను గాని సైబర్ మోసం జరిగితే 1930కు గాని సంప్రదించాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


