సమన్వయంతో పనిచేసి గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ బ్యూరో : భవిష్యత్తుకు పెను ముప్పుగా విస్తరిస్తున్న గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి భూతాన్ని అంతం చేసేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ శాఖలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గంజాయి కట్టడి విషయంలో పోలీస్ శాఖ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గంజాయి విక్రయదారులు, సరఫరాదారుల పూర్తి వివరాలు సేకరించి పీడీ యాక్ట్తో సహా కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులు, యువత ఈ వ్యసనాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి సాగుకు దూరంగా ఉండేలా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు.
అనంతరం ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ.. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, కల్తీ ఆహారం విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిహెమ్హెచ్ఓ సాధన, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆహార భద్రత అధికారిణి బి.ప్రత్యూష, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


