దండారి-గుస్సాడి ఉత్సవాలకు రూ.3 కోట్లు - నిధులు విడుదల చేసిన ప్రభు త్వం కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకునే దండారి-గుస్సాడి పండుగ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు హర్షం వ్యక్తం చేశారు.ప్రతి ఏటా దసరా నుండి దీపావళి వరకు ఆదివాసీ గిరిజనులు 15 రోజుల పాటు గుస్సాడి-దండారి ఉత్సవాలను అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాజ్ గోండులు, తోటి ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఉత్సవాల్లో లమన్ దండారి, గుస్సాడి నృత్యాలతో అలరిస్తారు. అయితే గతంలో ఈ ఉత్సవాలకు తగినన్ని నిధులు లేక గిరిజన గూడాలు ఇబ్బందులు పడేవి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. గిరిజన సంస్కృతిని కాపాడాలని, దండారి ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తక్షణమే రూ.3 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలోని 170 దండారి ఉత్సవ కేంద్రాల్లో పండగ నిర్వహణకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఒక్కో దండారి గూడాకు రూ.50 వేల నుండి లక్ష వరకు ప్రభుత్వం నేరుగా మంజూరు చేయనుంది. దీంతో గిరిజన సంస్కృతికి మరింత ప్రాధాన్యత లభించినట్లైందని ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోయం బాపూరావు మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతిని గుర్తించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీ సమాజంలో భరోసా నింపిందని అన్నారు. ఈ నిధులతో ఉత్సవాలు మరింత ఘనంగా, అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరరూ.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


