యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
- రూ.2లక్షల 20 వేలకు దక్కించుకున్న పులిమామిడి నరసింహారెడ్డి
- ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం,
- వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు
నల్గొండ/మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని యరుగండ్లపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 'యువ చైతన్య యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో గ్రామ యువకులు ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేశుడి లడ్డు వేలం పాట కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ హోరాహోరీ వేలంపాటలో యరుగండ్లపల్లి కాంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. వినాయకుడి దివ్య ప్రసాదమైన ఈ లడ్డూను ఆయన రూ. 2 లక్షల 20 వేల రికార్డు ధరకు దక్కించుకోవడం విశేషం.ఈ సందర్భంగా పులిమామిడి నరసింహారెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఎలాంటి ఆపదలు లేకుండా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లుతూ నిత్యం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు.లడ్డూను దక్కించుకున్న నరసింహారెడ్డిని యువ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ ప్రముఖులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


