కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వైభవంగా మహాగణపతి నవరాత్రి మహోత్సవాలు
కొమురవెల్లి,(సిద్దిపేట);కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాగణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు వైదిక, ఆగమ శాస్త్రోక్తంగా వివిధ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.శ్రీ మల్లికార్జున స్వామి వారి ప్రాతఃకాల పూజ అనంతరం క్షేత్రపాలక పూజ నిర్వహించి, మహాగణపతి స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, గౌరీ పూజ, దీప పూజ, జగద్గురు పంచాచార్య పూజ, నవగ్రహ పూజ, దిక్పాలక పూజ, ప్రధాన కలశ పూజ నిర్వహించారు. అనంతరం మహాగణపతి స్వామివారికి షోడశోపచార పూజలు, ఉత్తర పూజ నిర్వహించి, స్వామివారికి కూష్మాండ బలిహరణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.తదుపరి మహాగణపతి స్వామివారిని పల్లకిలో అధిష్ఠింపజేసి ఆలయ అర్చకులు, ఆగమ పాఠశాల విద్యార్థులు వేదఘోషలు, భజనలు చేస్తుండగా, మేళతాళాలు, ఒగ్గు పూజారుల డమరుక ధ్వనులతో వైభవంగా పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.అనంతరం శ్రీ స్వామివారి పుష్కరిణి కోనేరు వద్ద గంగా పూజ నిర్వహించి, త్రిశూల స్నానం, నిమజ్జనం, కంకణ విసర్జన కార్యక్రమాలను వైదిక సంప్రదాయానుసారం నిర్వహించారు.పుష్కరిణి కోనేరు నుండి వెండి కుంభంలో పవిత్ర జలాన్ని తీసుకువచ్చి గర్భాలయంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహానీరా జనం, మహామంత్ర పుష్ప సమర్పణ నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, ఒగ్గు పూజారులు, ఆగమ పాఠశాల విద్యార్థులు, భక్తులు తదితరులు పాల్గొని మహాగణపతి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


