ఆధారాలతో ఫిర్యాదు చేశాం...చర్యలు తీసుకోవాల్సిందే!
- శివన్నగూడ ఎఫ్ఎస్సిఎస్ వివాదంపై డైరెక్టర్ దామెర సత్తమ్మ ధ్వజం!
- తప్పులను కప్పిపుచ్చుకునేందుకే చైర్మన్ బుకాయింపు?
నల్గొండ/మర్రిగూడ:శివన్నగూడ రైతు సేవా సహకార సంఘంలో నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.సంఘంలో జరిగిన అవకతవకలపై తాము పక్కా ఆధారాలతోనే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ సంఘం డైరెక్టర్ దామెర సత్తమ్మ స్పష్టం చేశారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ నెల 5వ తేదీ సోమవారం మర్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తాము స్పష్టమైన ఆధారాలతోనే ఫిర్యాదు చేశామని సత్తమ్మ గుర్తుచేశారు.ఈ వ్యవధిలో ఎలాంటి వాస్తవం లేదంటూ చైర్మన్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే చైర్మన్ ఇలాంటి రొటీన్ ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
సమగ్ర విచారణ జరిపి,సంఘం పవిత్రతను కాపాడాలి
పక్కా ఆధారాలతో బాధ్యులపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కొందరు దీనిని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని సత్తమ్మ మండిపడ్డారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా రైతు సేవా సహకార సంఘం పవిత్రతను కాపాడి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఆమె కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


