ఎల్‌నినో నేపథ్యంలో ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం
- కూరగాయల సాగు విస్తరణకు కార్యాచరణ.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులే లక్ష్యం
- 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం సానుకూల పరిణామమని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే స్పైసెస్ సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192 శాతం, పూల సాగు 198 శాతం పెరిగినట్లు అధికారులు వివరించారు. ఈ పురోగతిని కొనసాగించడంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు విస్తరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కూరగాయల సాగు పెంచాలి.. ఎగుమతులపై దృష్టి పెట్టాలి
తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు పంటల ఉత్పత్తిని పెంచాలని, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. రాష్ట్రంలో పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేందుకు అనుకూలత ఉందని, కనీసం 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల ఎకరాల్లో సాగు చేపట్టే లక్ష్యంతో అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఆయిల్ పామ్ గెలల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల్లో ఈ పంటపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల్లో ముందుగానే మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. మొక్కల పంపిణీలో జాప్యం లేకుండా, రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా ప్రాసెసింగ్ సదుపాయాలను కూడా పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను సంక్రాంతి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆయిల్ పామ్ సాగులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన కంపెనీల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఆశించిన స్థాయిలో పురోగతి సాధించని కంపెనీలకు కేటాయించిన జిల్లాలను రద్దు చేసే విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ అంతరపంటగా కోకో సాగుకు ప్రోత్సాహం
ఆయిల్ పామ్ తోటల్లో అంతరపంటగా కోకో సాగు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోకో పంటకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల్లో సాగుపై ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తొలి దశలో అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో కోకో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల్లో అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను వేర్వేరుగా కాకుండా ఒకే ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. పథకాల అమలులో సమన్వయం పెంచడం, రైతులకు యంత్ర పరి…
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


