విద్యార్థుల ఆరోగ్యానికి తెలంగాణ అల్పాహార కార్యక్రమం
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా ప్రారంభం
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడటమే తెలంగాణ అల్పాహార కార్యక్రమం లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు. ఉదయం పూట ఆకలితో ఇబ్బందులు పడకుండా విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని, చదువుపై ఏకాగ్రత పెంచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి ఎంఈఓ, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రత్నం సుకుమారి, స్థానిక కౌన్సిలర్ జంగం కల్పన, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


