ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి
ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశం
ఆదిలాబాద్ బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచాలని, రాబోయే దసరా పండుగ లోపు అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ తో పాటు మార్కవుట్లు పూర్తి చేసి అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సర్వేలు, ప్రొసీడింగ్స్ జారీ ప్రక్రియపై ఆయన సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ ఈఈలు ప్రత్యేకాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోటోకాల్ ఇష్యూలు తలెత్తకుండా చూడాలని, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాలలో విధిగా భాగస్వామ్యం చేయాలని తేల్చిచెప్పారు. కేటాయించిన కోటా ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందాలని, ఇప్పటివరకు రాని వాటిని వెంటనే పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపాలిటీ, ఉట్నూర్, ఇందర్వెల్లి, గాదిగూడ, ఆయా మండలాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే క్లియర్ చేయాలని, సిరికొండలో మిగిలిన 29 ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కొన్ని రోజుల పాటు క్షేత్రస్థాయిలో కూర్చుని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత వాటిని మళ్లీ వెనక్కి తీసుకోవడం గానీ, జాప్యం చేయడం గానీ జరగకూడదని హెచ్చరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూ, పారదర్శకతతో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల మంజూరు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రూ, ఎస్.రాజేశ్వర్, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, భూ సర్వే కొలతల శాఖ ఏడి ప్రభాకర్, హౌసింగ్ పీడీ శంకర్, హౌసింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


